TSPSC Notification for 7306 Gurukula Posts in Telangana
గురుకులాల్లో 7306 పోస్టులు
* ఏప్రిల్ 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ఈనాడు - హైదరాబాద్: గురుకులాల్లో 7,306 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తొమ్మిది ప్రకటనలు జారీచేసింది. పోస్టుల సంఖ్య, రోస్టర్ విధానం, విద్యార్హతలు తదితర వివరాలతో సవివరంగా వేర్వేరు ప్రకటనల్ని తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. పరీక్షపత్రాలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దరఖాస్తుల సంఖ్యనుబట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించే వీలున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో పెట్టనుంది. పీజీటీ, టీజీటీ, పీడీ పోస్టులకు మే 28న రాతపరీక్ష, జూన్‌లో ప్రధాన పరీక్ష ఉంటుంది. మిగతా పోస్టులకు మే లేదా జూన్‌లో పరీక్ష నిర్వహిస్తుంది. అభ్యర్థులంతా ప్రతి పోస్టుకు ‘ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము’గా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఫీజు కింద మరో రూ.120 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు రాతపరీక్ష ఫీజును మాత్రం మినహాయించారు. 18-44 ఏళ్ల వయసున్న ‘నిరుద్యోగ అభ్యర్థులు’ కూడా ఈ మినహాయింపు పొందేందుకు అర్హులే. ఫీజుల్ని ఆన్‌లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, ఆబ్జెక్టివ్ పరీక్షలను హైదరాబాద్ (హెచ్‌ఎండీఏ పరిధి) లేదా పూర్వజిల్లాల ప్రధాన కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది. ప్రధాన పరీక్ష హైదరాబాద్‌లోనే ఉంటుందని స్పష్టం చేసింది.
కనీస మార్కులు 50 శాతం...: టీజీటీ పోస్టులకు డిగ్రీలో, పీజీటీలకు పీజీలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులుంటే చాలు. వీటితో పాటు బీఈడీ లేదా ఇంటిగ్రేటెడ్ బీఈడీ చేసినవారిని అర్హులుగా పేర్కొంది. పీజీటీ పోస్టులకు టెట్ స్కోరులో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుంది. ఏపీ టెట్ స్కోరు విషయంలో 2014 జూన్ 2కి ముందు సాధించిన స్కోరునే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. సోషల్ స్టడీస్ టీజీటీ పోస్టులకు బీకాం చదివినవారినీ అర్హులుగా పేర్కొంది. జోన్-5 కింద పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, జోన్-6 కింద హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాలను పేర్కొంది. క్రాఫ్ట్, ఆర్ట్స్, మ్యూజిక్ టీచర్లకు పదోతరగతి అర్హత ఉన్నవారిని అనుమతించారు. పీజీటీ, టీజీటీ, పీడీ ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష, ప్రధాన పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీ/స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపినవారిని 1: 15 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు (రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో). ప్రధాన పరీక్షలోని మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు...
1. పీటీజీ, టీజీటీ, పీడీ పోస్టులు
ఏప్రిల్ 18: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
మే 4 : దరఖాస్తుకు చివరి గడువు
ప్రిలిమినరీ పరీక్ష : మే 28
ప్రధాన పరీక్ష : జూన్‌లో నిర్వహించే అవకాశం
2. పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీ త ఉపాధ్యాయులు
ఏప్రిల్ 20: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
మే 4: దరఖాస్తుకు చివరి గడువు
అర్హత పరీక్ష: మే లేదా జూన్‌లో.
3. లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు పోస్టులు
ఏప్రిల్ 20: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
మే 6: దరఖాస్తుకు చివరి గడువు
అర్హత పరీక్ష: మే లేదా జూన్‌లో.
తెలంగాణ గురుకులాల్లో 372 ఆర్ట్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)
తెలంగాణ గురుకులాల్లో 43 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)
తెలంగాణ గురుకులాల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)
తెలంగాణ గురుకులాల్లో 256 లైబ్రేరియన్ పోస్టులు (చివరి తేది: 06.05.2017)
తెలంగాణ గురుకులాల్లో 197 మ్యూజిక్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)
తెలంగాణ గురుకులాల్లో 4362 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)
తెలంగాణ గురుకులాల్లో 616 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)
తెలంగాణ గురుకులాల్లో 921 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)
తెలంగాణ గురుకులాల్లో 533 స్టాఫ్ నర్స్ పోస్టులు (చివరి తేది: 06.05.2017)
Comments
Post a Comment